Monday, April 11, 2011

Corruption and Candle light ( My musings in Telugu )

నా మిత్రుడు విజయ్ కుమార్ చెప్పినట్టు, నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి. అన్నాహజారే దీక్షకు మన జనాలు బాగా స్పందించారు. చాల సంతోషం, జన లోకపాల్ బిల్లు కి కేంద్రం అంగీకారం. హజారే దీక్ష విరమణ. నిజమే మరి, పాపం 73 ఏళ్ళ పెద్దాయన నిరాహార దీక్ష కు కూర్చుంటే కాని మనకి కాని, రాజకీయ నాయకులకి కాని అవినీతి నిర్మూలన గుర్తుకు రాలేదు. ఆయన దీక్షకు కూర్చోగానే 'అవును, అదియే మన తక్షణ కర్తవ్యం' అంటూ బయల్దేరాము. 

అయ్యా, ఇన్నాళ్ళు మనకి అవినీతి గురించి గుర్తుకు రాలేదా. లేదు అంటే 'ఆ, ఎవరో ఒకరు మొదలుపెట్టనీ, మైనపు వొత్తులు వెలిగించి సంఘీభావం తెల్పితే సరిపోతుంది అని ఊరుకున్నామా? 'హజారే' కోసం ఒక 'హజార్' మంది 'హాజరు' అయ్యి 'మైనపు వొత్తుల మహోద్యమం' చేస్తే చాలు అంటారా? మన కార్పోరేట్ సోదరులు అయితే ఒక 'హాఫ్ డే' సెలవు పెట్టి మరీ 'మెరుగైన సమాజం' నిర్మించటానికి పాటుపడే టీవీ ఛానల్ వారు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారట. 


సోదరులారా, ఈ 'candle light solidarity' ఏమిటండి. ఏదో 'candle light dinner' లాగా? 'మైనం' కరిగితే అవినీతి అంతం అవుతుందా. కొంచెం మన 'మైండ్' కరగాలి కాని. ఈ చైతన్యం మనం ఎన్నికల సమయంలో ఓటు వేయటానికి ప్రదర్శించివుంటే మరింత బాగుండేది. ఎన్నికలు వచ్చినప్పుడు జంట నగరాలలో కనీసం యాభై శాతం కుడా ఓటు నమోదు కాలేదు అంటే దానికి భాధ్యులం మనం కాదా. అయ్యా, ఇప్పటికే  National Holidays కూడా Holiday list లో కలిపేసి 'Team Outing', 'Tour Plans' చేసుకునే సంస్కృతిలో పడిపోయాము. కనీసం ఎన్నికల రోజున ఆఫీసులు సెలవు ఇస్తే దాన్ని ఓటు వేసి సద్వినియోగం చేసుకుందాము. విద్యావంతులు మేధావులు కనీసం ఎనభై శాతం ఓట్లు వేసిన కుడా, ఒక పాతికమంది మంచి అభ్యర్ధులు గెలిచే అవకాశం వుంది. ఆ విధంగా మొదలు అంటూ పెడితేనే కదా, కొన్నాళ్ళకి, కొన్నేళ్ళకి అయినా వ్యవస్థ ఒక గాడిలో పడేది.

అనుపమ్ ఖేర్ మహాశయుడు అన్నాహజారే దీక్షా శిబిరానికి వచ్చి, సినీ తారలు, క్రికెటర్లు పెద్ద ఎత్తున సంఘీభావం తెల్పమని చెప్పి వెళ్ళాడట. అయ్యా, ముందు వాళ్ళందరిని ఆదాయపు పన్ను సరిగ్గా కట్టమనండి. వందల కోట్ల ప్రజా ధనం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అవినీతి నిర్మూలన ముందు ఈ విధంగా చేయమందాము. ఇంకో అడుగు ముందుకు వేసి, రాజ్యాంగం తగలపెడదాము, తిరగరాద్దాము అని రాద్ధాంతం చేసాడట. అయ్యా, తిరగ వ్రాయక్కర్లేదు, త్రిప్పి చదవక్కరలేదు. మన భాద్యతలు గుర్తుఎరిగి ప్రవర్తిస్తూ, మన హక్కులు కాపాడుకుంటూ, ఉన్న రాజ్యాంగం సరిగ్గా అమలయ్యేట్టు కృషి చేద్దాము. 

అన్నట్టు, గాంధీ తాత లాంటి ఆ పెద్దాయన దీక్షలో కూర్చుంటే మన నాయకులు కూడా క్షణం ఆలస్యం చేయకుండా అవినీతిని కడిగేస్తాం, తుడిచేస్తాం అంటూ బయల్దేరారు. మన నారాయణ సంఘీభావ దీక్షకి కూర్చున్నారు, జగనన్న ఒక్కరోజులో అవినీతిని అంతం చేయడానికి దీక్షకు తయారయ్యాడు, బాబు గారు అవినీతిపరులను ఏరిపారేయమని ప్రధాన మంత్రి కి లేఖ వ్రాసారు, దత్తన్న ట్యాంక్ బండ్ మీద 'candle light rally' చేపట్టారు, J.P.గారు టీవీ చానల్స్ లో కనపడి అవినీతి అంతం చేయటం మన సామజిక భాధ్యత అని తన వాక్పటిమతో ఉపన్యాసాలు ఇచ్చారు. తెరాస వాళ్ళు తెలంగాణా రాగానే అవినీతిని అంతం చేద్దామని ప్రతినబూనారు. పాపం మన CM గారు కడప, పులివెందుల ఎన్నికలలో బిజీగా వున్నారు కదా. అందుకే ఎక్కువగా స్పందిచలేదు అనుకోండి. ( ఈ Corruption eradicate చేసే దాన్కి, మరి ముందల ముందల సోనియా గాంధీ గారి నాయకత్వం లో ఒక action plan తో ready అవుతారేమో ). చాలా సంతోషం, మరి రాత్రికి రాత్రి 'అమృతం కురిసిన రాత్రి' లాగా అవినీతి అంతం అయిపోతుంది లెండి.

అయ్యా, ఒక్క మనవి! అవినీతిని క్రూకటి వ్రేళ్ళతో పెకలించివేద్దాము, సమూలంగా అంతం చేద్దాము అనే పెద్ద మాటలు మనం వాడద్దండి. ఎందుకు ఈ ఆత్మవంచన. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలు ఎలానో ఈ అవినీతి ఒక ఆరో భూతం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో మనతోనే  వుంది, వుంటుంది - మనకు తోడుగా, నీడగా. కాకపోతే అవినీతి తీవ్రత తగ్గించడానికి మన వంతు కృషి శాయశక్తులా చేద్దాము. వ్రేళ్ళు దేవుడెరుగు, ముందు కొమ్మలు కత్తిరిద్దాము, నీరు పోసి పెంచిపోషించటం ఇకతో ఆపేద్దాము. Allow it to die its own death.

క్రికెట్ లో పాకిస్తాన్ పైన మ్యాచ్ గెలవగానే, ఆ దేశం పైన యుద్ధంలో గెలిచినట్టుగా సంబరపడ్డాము. మన జట్టు ప్రపంచ కప్పు గెలవగానే దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఒకేరోజు చేసుకున్నాము. జన లోక్ పాల్ బిల్లు రాగానే జబ్బలు చరుచుకున్నాము. పెద్దాయన అన్నా హజారే ఉద్యమానికి ఇంతటి స్పందన రావటం అపూర్వం. అయితే ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగిద్దాము. అంతేకాని మళ్ళీ ఈ IPL మ్యాచ్ ల గోలలోనో , జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి సందడిలోనో, లేదు అంటే మరి ఇంకా ఏదైనా నిత్యానందమైన సెక్స్ స్కాండల్ హాట్ న్యూస్ లోనో పడి మరువద్దు, మరుగునపడేయద్దు. అవినీతి నిర్మూలన అనేది ఒక సామజిక అవసరంగా గుర్తించి సమాజంలో భాధ్యత కల్గిన వ్యక్తులుగా మన విధులు సక్రమంగా నిర్వర్తిద్దాము. ఒక పాతిక ఏళ్ళు నిరంతర కృషి చేస్తే, కనీసం మన పిల్లలు, భావి తరాలవాళ్ళు అయినా మన కృషి గుర్తించి ఆ భూతం జోలికి వెళ్ళకుండా వుంటారేమో........






Friday, April 8, 2011

తొలి పలుకు

అంతర్జాలంలో నేను ఆడుకోవటానికి నాదైన ఈ మాటల మైదానాన్ని ఇంత సృజనాత్మకంగా తయారుచేసి ఇచ్చిన నా ఆత్మీయ నేస్తానికి ముందుగా నేను కృతఙ్ఞతలు తెల్పుకోవాలి. పేరులో 'నేముంది '? అని అనుకోకుండా ఒక చక్కటి పేరు పెట్టాలి అనుకున్నా.' సందీపం' అందామా అని 'సందేహం' వచ్చి సరే 'సందేశం' ( SUN DESH ) అని నామకరణం చేసాను. ఆ విధంగా ఉగాది నాడు ఈ 'Blog' ప్రారంభించటం జరిగింది. ఈ మాటల ప్రయాణం ఇలా కొనసాగాలి అని, అను'భావించి' వ్రాయబోయే నా 'భావాలను' నా మిత్రులందరూ కూడా అప్పుడప్పుడు 'పలుకరించి', 'సూచించి', నచ్చకపోతే 'ఖండించి' 'దీవించాలని' కోరుకుంటూ.........